కృష్ణాజిల్లా గుడివాడలో పెద్దలు కుదిర్చిన ఓ పెళ్లి ఆగిపోయింది.. ఓ వీడియో దీనికి కారణమైంది. అక్కడితో ఆగకుండా పెళ్లి కొడుకు, పెళ్లి పెద్దలు, బంధువులపై కేసులు నమోదయ్యాయి ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పట్టణంలోని బంటుమిల్లి రోడ్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఫేస్బుక్ ద్వారా న్యూటన్బాబు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో.. అతడు నగ్నంగా వీడియో కాల్ చేయమని అడిగాడు. ఆమె కూడా అతడు చెప్పినట్లే చేసింది.
ఇటీవల ఆ యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చియమైంది. దీంతో యువతి తన కాబోయే భర్త అని అతనితో కూడా సన్నిహితంగా దగ్గరైంది. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉండగా న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన నగ్న వీడియోను వరుడికి పంపాడు. అతడు ఆ వీడియోను పెళ్లి కుదిర్చిన పెద్దలకు పంపి ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి పెద్దలు అక్కడితో ఆగకుండా.. ఆ వీడియోను వధువు కుటుంబానికి పంపి పెళ్లి కుదరదని చెప్పారు.
ఈ క్రమంలో న్యూటన్ బాబు బంధువులు ఆ వీడియోను మరికొందరికి పంపారని పోలీసులు గుర్తించారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టెక్నాలజీ సాయంతో ఆధారాలు సేకరించామని.. యువతిని నగ్న వీడియోను రికార్డు చేసిన న్యూటన్బాబుపై అత్యాచారయత్నం కేసు, వరుడిపై అత్యాచారం కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. బంధువులపై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. వ్యక్తిగత నగ్న వీడియోలను ఎవరైనా పంపితే వాటిని డిలీట్ చేయకుండా సోషల్ మీడియాలో తిరిగి పంపితే వారిపై కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.