అల్పసంఖ్యాక మతాల ప్రజలు, మైనారిటీ జాతుల హక్కులు పరిరక్షించకపోతే భారతదేశం ముక్కచెక్కలవుతుందని మాజీ అధ్యక్షుడు ఒబామా గురువారం వ్యాఖ్యానించారు. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ప్రఖ్యాత జర్నలిస్టు క్రిస్టీన్ అమన్ పూర్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, భారత సమాజంలో బలహీనవర్గాల స్థితిగతులపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడం సబబుగా కనిపించడం లేదని భారత మేధావులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇండియాలో మతపరమైన, జాతిపరమైన మైనారిటీల హక్కులు పరిరక్షించలేకపోతే, భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో దేశం ముక్కచెక్కలవడం మొదలవుతుంది,’ అని ఒబామా ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన అమెరికా అధినేతగా గుర్తింపు పొందిన ఒబామా ఇలా మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.