ఏపీ ప్రజలకు విశాఖకు చెందిన జన జాగరణ సమితి మూడు ప్రశ్నలు సంధించింది. మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. రూ.లక్ష గెలుచుకోండి అంటూ ఆఫర్ ఇచ్చారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై జన జాగరణ సమితి వినూత్న నిరసనను తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విద్యా వంతులు, మేధావులకు జన జాగరణ సమితి ఒక బహిరంగ సవాల్ విసురింది. ఏపీ రాజధాని ఏది?.. 2.పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది?.. 3.విశాఖ ఉక్కును కాపాడేది ఎవరు? అనే ఈ మూడు ప్రశ్నలు సంధించింది.
ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి జన జాగరణ సమితి రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తుంది అన్నారు. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలను 7288904076 ఈ ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చేయవలసిందిగా కోరారు. ఏపీకి రాజధాని ఏదో తెలియక, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో అర్థం కాక, ప్రైవేటీకరణ నుంచి విశాఖ ఉక్కును కాపాడే దిక్కు లేక ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని కోల్పోయింది అన్నారు. విద్యావంతులు, మేధావులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని కాపాడటం కోసం ఉద్యమించాలని జన జాగరణ సమితి తరఫున కోరారు. ప్రస్తుతం ఈ మూడు ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా జన జాగరణ సమితి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీల్లో రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు కూడా గో బ్యాక్ సీఎం సార్.. రాజధాని అమరావతిని నిర్మించండి అంటూ విశాఖలో పోస్టర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ జన జాగరణ సమితి కొంతకాలంగా ఇలా తమ నిరసనను తెలియజేస్తోంది.