పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్లారు. గురువారం పారిస్‌లో జరిగిన సదస్సుకు షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. అయితే ఈ సదస్సుకు వెళ్తుండగా.. ఆయన చేసిన పనికి ప్రస్తుతం ట్రోలింగ్‌కు గురవుతున్నారు. సదస్సు కోసం కారులో వచ్చిన షెహబాజ్ షరీఫ్.. అక్కడ ఉన్న ప్రోటోకాల్ అధికారిణి పట్ల ప్రవర్తించిన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది.
పారిస్‌లో జరుగుతున్న కొత్త ప్రపంచ ఆర్థిక ఒడంబడిక సదస్సుకు హాజరయ్యేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్లారు. కారు దిగే సమయానికి అక్కడ వర్షం పడుతోంది. అయితే అక్కడ ఉన్న ఓ ప్రోటోకాల్ అధికారిణి.. గొడుగు పట్టుకుని వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. దీంతో కారులో నుంచి దిగిన షెహబాజ్ షరీఫ్ తడవకుండా ఉండేందుకు ఆయనకు ఆ లేడీ ఆఫీసర్ గొడుగు పట్టారు. అనంతరం కొన్ని అడుగులు వేసిన తర్వాత ప్రధాని షెహబాజ్ ఆమెతో ఏదో మాట్లాడారు. అనంతరం ఆ లేడీ ఆఫీసర్ చేతిలో ఉన్న గొడుగు తీసుకుని భవనం లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఆమె అక్కడ వర్షంలో తడిసి పోయారు. ప్రధాని వెనకాలే ఆ లేడీ ఆఫీసర్ భవనంలోకి వెళ్లారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళా అధికారిని వర్షంలో గొడుగు లాక్కొని వదిలి వెళ్లడాన్ని నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఉద్దీపన ప్యాకేజీ కోసం వివిధ దేశాల వద్ద చేతులు చాచుతోంది. ఇందులో భాగంగానే చివరి ప్రయత్నంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి - ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివాతో గురువారం సమావేశమయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న కొత్త ప్రపంచ ఆర్థిక ఒడంబడిక సదస్సు శుక్రవారంతో ముగిసింది.