రష్యాలో పరిస్థితి చేయి దాటిపోతోంది. పుతిన్ సైనిక నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించిన ప్రైవేటు సైన్యం.. ఇప్పటికే ఒక నగరాన్ని హస్తగతం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ప్రభుత్వం కూడా వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌ను అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాజధాని మాస్కో వైపు.. కిరాయి సైన్యం కదులుతోంది. మాస్కోకు కేవలం 6 గంటల దూరంలో ఉన్న వాగ్నర్ గ్రూప్.. రాజధాని లోకి ప్రవేశించేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
అయితే రష్యా సైన్యానికి చెందిన 3 హెలికాప్టర్లను నేల కూల్చినట్లు వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. తాము వెళ్తున్న మార్గంలో అతని అడ్డుగా ఉన్న వాటిని నాశనం చేసుకుంటూ ముందుకు సాగుతామని ప్రిగోజిన్ పేర్కొన్నారు. తమ దళాలు మాస్కో వైపు వెళ్తున్నాయని.. రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రష్యా ప్రజలకు ప్రిగోజిన్ కీలక సూచన చేశారు. గత ఏడాదిన్నరగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్న సైనిక నాయకత్వాన్ని శిక్షించేందుకు తమతో చేతులు కలపాలని కోరారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రోస్తోవ్ నగరంలోని సైనిక స్థావరాలను వాగ్నర్ గ్రూప్ ఆక్రమించినట్లు తెలుస్తోంది. రోస్తోవ్ నగరం మొత్తం ప్రస్తుతం ప్రైవేటు సైన్యం ఆధీనంలో ఉందని.. వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. ఆ నేపథ్యంలో రోస్తోవ్ నగరంలో శనివారం జరిగే అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు రోస్తోవ్ రీజినల్ గవర్నర్ వాసిలీ గోలుబేవ్ వెల్లడించారు. నగరంలోని రవాణా వ్యవస్థలో మార్పులు చేసినట్లు టెలిగ్రామ్ వేదికగా తెలిపారు. అయితే వాగ్నర్ గ్రూప్ ఆధీనంలో ఉన్న రోస్తోవ్ నగరంలో సాధారణ పరిస్థితులు కనిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే రోస్తోవ్ నగరంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా ప్రసంగం చేయనున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వాగ్నర్ గ్రూప్‌కు చెందిన హెడ్ క్వార్టర్స్‌లోకి రష్యా సైనిక దళాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. అటు.. వాగ్నర్ గ్రూప్‌నకు చెందిన రెండు సైనిక వాహనాలను వొరొనెజ్ ప్రాంతంలో రష్యన్ ఆర్మీ హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.