అమెరికాలో మూడు రోజుల పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయితే మోదీ పర్యటన ముగింపు నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్ - అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్బెన్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో భారత జాతీయ గీతం జనగణమన, ఓం జై జగదీశ్ హరే గీతాలని ఆలపించి భారతీయులకు సుపరిచితురాలిగా నిలిచారు. ఈ సందర్భంగా మరోసారి భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు ఆమె నమస్కరించారు.
యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ప్రధాని మోదీకి అధికారిక ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 38 ఏళ్ల మేరీ మిల్బెన్.. మొదట జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మిల్బెన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో గౌరవంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. భారతీయులు తనను ఒక కుటుంబ సభ్యురాలిగా భావించడం ఎంతో ఆనందంగా ఉందని మిల్బెన్ పేర్కొన్నారు. ఇదే సందర్భంగా నలుగురు అమెరికా అధ్యక్షుల కోసం అమెరికన్ దేశభక్తి గీతాన్ని పాడటం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. అమెరికన్, భారత గీతాలు రెండు కూడా ప్రజాస్వామ్య స్వేచ్ఛకు ఆదర్శంగా ఉంటాయని తెలిపారు.
మూడు రోజల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అడుగడుగునా ప్రత్యేక ఆహ్వానాలు దక్కాయి. ఎయిర్‌పోర్టులో విమానం దిగినప్పటి నుంచి చివరి కార్యక్రమం వరకు ప్రతీ చోట అపూర్వ స్వాగతం పలికారు. వైట్‌హౌస్, అమెరికన్ కాంగ్రెస్, సహా ప్రవాస భారతీయులతో సమావేశంలోనూ మోదీ మోదీ అంటూ భారీ ఎత్తున నినాదాలు మార్మోగాయి. ఇందులో ప్రవాస భారతీయులే కాదు.. అమెరికన్ పౌరులు సైతం కూడా పాల్గొనడం మరో ప్రత్యేకత. మోదీ రెండోసారి అమెరికాలో పర్యటించిన వేళ.. ఎంతో చారిత్రాత్మకంగా భావించిన బైడెన్ సర్కార్.. మోదీతో పాటు బైడెన్ ఫొటో ఉన్న ఓ భారీ బ్యానర్‌ను చాపర్ ద్వారా న్యూయార్క్ వీధుల గుండా ఎగురవేశారు. దీంతో పాటు లోయర్ మాన్‌హట్టన్ నగరంలో ఉన్న వన్ వరల్డ్ ట్రేడ్‌సెంటర్ భవనంపై భారతీయ జెండా రంగులు కలిగిన లైట్లను ప్రదర్శించారు. న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పైనా మువ్వన్నెల జెండా దర్శనం ఇచ్చింది.