రష్యాలో అంతర్గత తిరుగుబాటుకు ప్రయత్నాలు చేస్తున్న వాగ్నర్ గ్రూప్‌కు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశాడు. వాగ్నర్ సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో రష్యన్లను ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్.. దేశాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటానని తేల్చి చెప్పారు. వ్యక్తిగత లాభం కోసం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్.. రష్యాకు ద్రోహం చేస్తున్నాడని పుతిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో తన ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.
సొంత లాభం కోసం వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్.. రష్యాకు ద్రోహం చేస్తున్నారని పుతిన్ మండిపడ్డారు. ఇది రష్యాకు ప్రిగోజిన్ చేసిన వెన్నుపోటుగా అభివర్ణించారు. ఇది దేశ ద్రోహ చర్య అని.. రష్యా సైనిక అధిష్ఠానాన్ని కూల్చేందుకు ఆయుధాలు పట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వాగ్నర్ గ్రూప్ సైనికులకు తీవ్ర హెచ్చరికలు పంపారు. తన దేశ ప్రజలను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు వెనకాడనని తేల్చి చెప్పారు. మరోవైపు.. రష్యన్లను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించడానికి ముందు రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు.. వాగ్నర్ గ్రూప్‌లో ఉన్న సైనికులతో మాట్లాడారు. మీరంతా మెసానికి గురయ్యారని.. మిమ్మల్ని యెవ్జెనీ ప్రిగోజిన్ ఒక నేరంలోకి నెట్టేశారని వారికి తెలిపారు. వాగ్నర్ గ్రూప్‌లో ఉన్న సైన్యం అంతా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. అలా చేస్తే వారి భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని హితవు పలికారు.
ఉక్రెయిన్ నుంచి 2014 లో ఆక్రమించుకున్న క్రిమియా ప్రాంతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు పలికింది. ఈ మేరకు
క్రిమియా ప్రాంతానికి పుతిన్ నియమించిన గవర్నర్ తెలిపారు. క్రిమియాలోని లుహాన్స్క్, డొనెట్స్క్ నేతలు పుతిన్ వెంట ఉంటామని ప్రకటించారు. రష్యాపై తిరుగుబాటుతో వాగ్నర్ గ్రూప్‌లో రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో
వాగ్రర్ గ్రూప్‌లో నియామకాలకు సంబంధించిన ప్రకటనలతో మాస్కోలో ఉన్న బిల్ బోర్డులను తీసివేసిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామంతో వాగ్నర్ గ్రూప్‌లో నియామకాలు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
రష్యా సైనిక అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తున్న వాగ్నర్ గ్రూప్‌కు స్టోమ్ జెడ్ మద్దతు ప్రకటించింది. రష్యాలో ఉన్న జైళ్లలో బలవంతంగా నిర్భందించిన ఖైదీల సమూహమే ఈ స్టోమ్ జెడ్. ఈ మేరకు వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్‌కు తమ మద్దతు ప్రకటిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ఈ పోరాటంలో ప్రిగోజిన్‌కు మద్దతుగా వెంట రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.