ఆయనో అదనపు సబ్ కలెక్టర్. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్ అధికారులు.. ఉన్నఫలంగా తెల్లవారుజామునే దాడులు నిర్వహించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ అదనపు సబ్ కలెక్టర్ ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఇంట్లో ఉన్న సొమ్మును అంతా.. డబ్బాల్లో నింపి.. గుట్టు చప్పుడు కాకుండా పక్కింటిపైకి విసిరేశాడు. అయితే అనుమానం వచ్చి అధికారులు గాలించగా.. భారీగా డబ్బు బయటపడింది.
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో నబరంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రశాంత కుమార్ రౌత్‌కు చెందిన భువనేశ్వర్‌లోని ఇంటికి విజిలెన్స్ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున చేరుకున్నారు. దీంతో ప్రశాంత కుమార్‌కు ఏం చేయాలో తోచలేదు. దీంతో తన ఇంట్లో ఉన్న సొమ్మును మొత్తం బాక్సుల్లో నింపాడు. దాదాపు రూ. 2 కోట్లకు పైగా నగదును ఆరు బాక్సుల్లో ఉంచి.. తన ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి టెర్రస్‌పైకి విసిరేశారు.
అయితే డబ్బులతో నింపిన బాక్సులను ప్రశాంత కుమార్ పక్కింటిపై విసిరేయడం విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వెంటనే పక్కింటిపైకి వెళ్లి నగదు నింపి పడేసిన బాక్సులను తీసుకువచ్చి లెక్కించారు. అందులో రూ. 2.25 కోట్ల డబ్బు పట్టుబడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ ఆరు డబ్బాల్లో నింపి ఉన్న నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రశాంత కుమార్ తన వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఇటీవల రూ.500 నోట్లుగా మార్పించినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.
అయితే భువనేశ్వర్‌లోని ప్రశాంత కుమార్ నివాసం సహా మరో తొమ్మిది ప్రాంతాల్లోనూ ఒకేసారి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే ప్రశాంత కుమార్ అదనపు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నబరంగ్‌పుర్‌లో మరో రూ.77 లక్షలు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ తనిఖీల్లో రూ. 3 కోట్లకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నబరంగ్‌పూర్ జిల్లాలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ ప్రశాంత కుమార్ రౌత్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. గతంలో ఒకసారి లంచం కేసులో ప్రశాంత కుమార్ రౌత్ అరెస్ట్ అయ్యారు. 2018లో సుందర్‌గఢ్ జిల్లాలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రశాంత కుమార్ అరెస్ట్ అయ్యారు.