రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకునే పవన్ కల్యాణ్ ఏనాడైనా తన సామాజిక వర్గానికి రూపాయి అయినా ఖర్చు పెట్టాడా? అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి నిలదీశారు. పవన్ కల్యాణ్ సీఎం అయితే చూడాలన్నది తన కోరిక అని ఏపీ మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. పవన్ ముఖ్యమంత్రి అవ్వాలన్న మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆయన ఏం మాట్లాడారో ఓసారి వీడియో చూడాలని అన్నారు. పవన్ కల్యాణ్ కులాల ప్రస్తావన తీసుకురాను అంటూనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని నారాయణస్వామి మండిపడ్డారు. ఏపీలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వమని, ప్రజల గురించి పవన్ కల్యాణ్ కు ఏం తెలుసో చెప్పాలని నిలదీశారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబు, లోకేశ్ లను అవినీతిపరులని తిట్టాడని గుర్తుచేశారు. పవన్ సినిమాలను తాను కూడా చూస్తానని, పేదల కన్నీరు తుడిచే ఒక్క సినిమా అయినా ఆయన చేశాడా? అని ప్రశ్నించారు.