విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జివిఎంసి కమిషనర్ సి. ఎం. సాయికాంత్ వర్మ కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి సోమవారం తమ సొంత వాహనాలను వదిలి, ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగిస్తూ పలువురి ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం మేయర్ ఆరిలోవలోని తమ క్యాంపు కార్యాలయం నుండి బస్సులో ప్రయాణించగా, జివిఎంసి కమిషనర్ సైకిల్ పై కార్యాలయంనకు చేరి వారి వారి విధులలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారి ఇరువురూ మాట్లాడుతూ, నగరంలో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోయిందని వాటి నియంత్రణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, నగరంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల యజమాన్యాలు వారంలో ఒక్క రోజు ప్రజారవాణాను వారి సిబ్బంది ఉపయోగించేలా చూడాలన్నారు. కాలుష్య నియంత్రణ లో భాగంగా సాద్యమైనంతవరకు విధ్యుత్ వాహనాలను ఉపయోగించాలన్నారు. కాలుష్య నియంత్రణకు జివిఎంసి విశేష కృషి చేస్తుందని, మొక్కలు సంరక్షణ, కార్యాలయంలోనికి ఉద్యోగుల వాహనాలు అనుమతించక పోవడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు.