రోడ్ల అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ సి. ఎం. సాయికాంత్ వర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలోని లుంబిని పార్క్, హెచ్. బి. కాలనీ, నార్త్ నియోజకవర్గంలోని సీతమ్మధార, ఎన్జీవోస్ కాలనీ, మాధవధార, ఆర్ అండ్ బి, ఎన్. ఎస్. టి. ఎల్. రోడ్డు, లక్ష్మీ నగర్, సింహాచలం, అడవివరం తదితర ప్రాంతాలలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె. కె. రాజుతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా తారు రోడ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లుంబిని పార్క్ బీచ్ లో పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి వ్యర్ధాలు, భవన నిర్మాణ వ్యర్ధాలు లేకుండా చూడాలని, ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించాలని, చాలాచోట్ల వినియోగంలో లేని వాహనాలు, బడ్డీలు, ఇతర వస్తువులు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించి ఆ ప్రాంతాలను శుభ్రపరచాలన్నారు. చాలాచోట్ల రోడ్డుకి ఇరువైపులా భవన నిర్మాణ వ్యర్దాలతో పాటు పిచ్చి మొక్కలు తొలగించాలని, 48 బస్ రూట్ రోడ్డును వెడల్పు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని గిరి ప్రదక్షిన రోడ్లలోని జంక్షన్ లను ఆధునికరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉత్తర నియోజకవర్గం పరిధిలోని పలు సమస్యలను నియోజవర్గ సమన్వయకర్త కె. కె. రాజు కమిషనర్ దృష్టికి తీసుకురాగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ పర్యటనలో జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు, పట్టణ ప్రణాళిక అధికారి సునీత, డిడిహెచ్ దామోదర్ రావు, పర్యవేక్షక ఇంజనీర్లు శ్యాంసన్ రాజు, సత్యనారాయణ రాజు, వేణుగోపాల్, రామ్మోహన్, జోనల్ కమిషనర్లు విజయలక్ష్మి, కృష్ణ, మల్లయ్య నాయుడు, కార్పొరేటర్లు కె. అనిల్ కుమార్ రాజు, కంపా హనుక్, అల్లు శంకర్రావు, కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు ఇతర జివిఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.