శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణలో నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని జివిఎంసి కమిషనర్ సి. ఎం. సాయికాంత్ వర్మ పలు స్వచ్ఛంద సంస్థలను కోరారు. సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో పలు స్వచ్ఛంద సంస్థలు, ఆర్. డబ్ల్యు. ఎస్, ఎన్. జి. ఓ. ఎస్, ఎన్. ఎస్. ఎస్, ఎన్. సి. సి. ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అందించే ప్రసాదాలు, తీర్థ పానీయాలు ప్లాస్టిక్ కలిగిన వస్తువుల్లో అందించరాదని, అందుకు మీ సహకారం అవసరమని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ద్వారా 500 మంది వాలంటీర్లను, అలాగే స్వచ్ఛంద సంస్థలు వీలైనంతవరకు ఎక్కువ మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
పలు స్వచ్ఛంద సంస్థలు అందించే అన్న ప్రసాద వితరణ, తాగునీరు ప్లాస్టిక్ రహిత వస్తువులతో అందించాలన్నారు. ప్రతి ప్రసాదం కౌంటర్ వద్ద డస్ట్ బిన్లు ఆయా స్వచ్ఛంద సంస్థలే ఏర్పాటు చేసుకోవడంతోపాటు వ్యర్ధాలను డస్ట్ బిన్ లో వేసే విధంగా వాలంటీర్ల సహకారంతో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏ ఏ ప్రాంతాలలో తమ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే యు. ఎన్. డి. పి. కన్సల్టెంట్ రాజామణికి తెలియజేయాలన్నారు. 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు గిరి ప్రదక్షిణలో తప్పిపోకుండా జివిఎంసి టాగ్ లను ఏర్పాటు చేస్తుందని, ట్యాగ్ పై తల్లిదండ్రుల పేర్లతో పాటు ఫోన్ నెంబర్ రాయడం జరుగుతుందన్నారు.
గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల పొడుగునా అక్కడక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే సింహాచలం కొండ మెట్లు మార్గాన మూడు చోట్ల వైద్య శిబిరం ఏర్పాటు అయ్యేలా చూడాలని ఆదేశించామన్నారు. తొలి పావంచి, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో వాలంటీర్లను ఏర్పాటుచేసి భక్తులకు తాగునీరు అందించి, ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావును ఆదేశించారు. గిరి ప్రదక్షిణలో ఎటువంటి తోపులాట్లు లేకుండా రద్దీ నియంత్రణకు వాలంటీర్లను ఎక్కువగా ఉపయోగించుకోవాలన్నారు.