జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అందే వినతులన్నిటినీ తప్పనిసరిగా శతశాతం పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లికార్జున ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. తదుపరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి అందే వినతులను వెంటనే అదేరోజు పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతివారం దీనిపై సమీక్ష నిర్వహిస్తామని, ఎక్కడా పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు.
అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జెకెసి వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని రకాల అర్జీలపై, తమకు సంబంధం లేదని తప్పించుకోకూడదని, ఇతర శాఖలను సమన్వయం చేసుకొని వినతులను పరిష్కరించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో క్యాంపు పూర్తి డేటాను అప్లోడ్ చేయడంలో జెడ్సీలు, ఎంపిడివోల పర్యవేక్షించా లన్నారు. తదుపరి కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో 238 విజ్ఞప్తులు అందాయి. ఈ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. ఎస్. విశ్వనాథన్ , జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.