‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు వల్లించడం కాదు. ఎన్నికల బరిలోకి సొంత జిల్లా నుంచి పోటీ చేయాలి’ అని మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాధరాజు డిమాండ్ చేశారు. ఆచంట మండలం తూర్పుపాలెంలోని క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన విలేకరులతో మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికల్లో మంత్రులు కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), కారుమూరి నాగేశ్వరరావు(తణుకు), ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు (నరసాపురం) లపై పోటీ చేస్తారా..? లేకపోతే ఆచంటలో నా మీద పోటీ చేస్తారా ? కాదంటే భీమవరంలో గ్రంధి శ్రీనివాస్‌తో మరోసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారా..? మీరే నిర్ణయించుకోండి. గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు’ అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లను విముక్త వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌గా చేస్తానంటున్నారు. అంటే ఆ సీట్లన్నీ జనసేనకు అడుగుతారు’ అని అన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు పవన్ మాట వింటే గత ఎన్నికల్లో ఆయన భీమవరంలో ఎందుకు ఓడిపోయారో ప్రజలకు చెప్పాలని నరసాపురం ఎమ్మెల్యే, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు గెలవనివ్వనని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి పట్టం కట్టాలో బాగా తెలుసన్నారు.