దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఢిల్లీలోని పరిపాలన నియంత్రణకు సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వంలోని అధికారులకు సంబంధించి మే 19 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ సహా ఇతర ప్రభుత్వ అధికారుల పోస్టింగులు, బదిలీలకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. వీరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినపుడు లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయమని ఈ ఆర్డినెన్స్‌లో వెల్లడించింది. అయితే ఈ ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజా ప్రభుత్వ అధికారాలను కేంద్రంలోని మోదీ సర్కార్ అడ్డుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది.
నిజానికి ఢిల్లీలోని పాలనపై అంతకుముందే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వం నిర్వహించాల్సిన కార్యనిర్వాహక విధులను లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం నియంత్రిస్తోందని.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. మే 11న కీలక తీర్పు ఇచ్చింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూ వ్యవహారాలు మినహా ఢిల్లీలోని మిగతా అన్ని శాఖలు, విభాగాలు, సేవల నియంత్రణపైన పూర్తి అధికారం.. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను మే 19 న తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును జులై 3 వ వారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై అజమాయిషీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును దేశంలోని వివిధ పార్టీలు తీవ్రంగా ఎండగట్టాయి. దీని కోసం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రతిపక్షాల మద్దతును కూడగట్టారు. ఈ పార్లమెంటు వర్షాకల సమావేశాల్లో కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెడితే రాజ్యసభలో దాన్ని ఓడించేందుకు వివిధ పార్టీల మద్దతును కేజ్రీవాల్ కోరారు. రాజ్యసభలో అవసరమైన మద్దతు బీజేపీకి లేనందున.. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.