ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ లేకుండానే డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ఉత్తర కరోలినాలోని చార్లెస్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అయితే రన్‌వే నుంచి విమానాన్ని తొలగించడం కోసం సిబ్బంది రన్‌వేను మూసివేశారని డెల్టా ఎయిర్‌లైన్స్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం విమానం అట్లాంటా నుంచి బుధవారం ఉదయం 7.25 గంటలకు బయలుదేరింది. బోయింగ్ 717 విమానంలో 96 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ముగ్గురు ఫ్లైట్ అటెండెంట్లు సహా మొత్తం 101 మంది ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది.
ఈ విమానం ఛార్లెస్ డగ్లస్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపిస్తున్నప్పుడు ‘నోస్ గేర్’ సురక్షితంగా లేదనే సంకేతం వచ్చింది. దీనిపై మరింత లోతుగా తెలుసుకోడానికి సిబ్బంది మిస్డ్ అప్రోచ్ విధానాన్ని ప్రారంభించారు.. తర్వాత విమానం షార్లెట్‌లోని ATC టవర్‌ను దాటినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేయగా నోస్ ల్యాండింగ్ గేర్ డోర్లు తెరిచి ఉన్నాయని గుర్తించారు.. అయితే నోస్ గేర్ కూడా అప్ పొజిషన్‌లోనే ఉంది’ అని డెల్టా తెలిపింది.
విమానంలో ప్రయాణించిన క్రిస్ స్కోటార్‌జాక్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ల్యాండింగ్ సమయంలో విమానంలో ఎటువంటి గందరగోళానికి గురికాలేదని అన్నాడు. అలాగే, పైలట్, సిబ్బందిపై ప్రశంసలు కురిపించాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు అందరూ చప్పట్టు కొట్టి సిబ్బందిని అభినందించారు.
‘ఇది చాలా అరుదైన సంఘటన అయినప్పటికీ అనేక క్లిష్టమైన సమయాల్లో సురక్షితంగా విమానాన్ని నిర్వహించేలా డెల్టా సిబ్బందికి విస్తృత శిక్షణ ఇస్తారు..ఫ్లైట్ 1092 సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలోని ప్రయాణికులు తమ బ్యాగ్‌లను తిరిగి పొందడం.. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడం, వారిని జాగ్రత్తగా చూసుకోవడంపైనే తదుపరి దృష్టి. మా కస్టమర్‌లు అనుభవించిన దానికి మేం క్షమాపణలు కోరుతున్నాం’ అని ఎయిర్‌లైన్ ఒక వివరణాత్మక ప్రకటనలో తెలిపింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమానం నోస్ గేర్‌తో ల్యాండ్ చేసినట్టు ధ్రువీకరించింది. ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తామని తెలిపింది.