ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు.. హుటాహుటిన ఆమెను న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మడోన్నాను గత శనివారం ఆసుపత్రిలో చేర్పించగా.. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఈ మేరకు ఆమె మేనేజర్ గుయ్ ఓసీరే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు తెలిపారు. ఐసీయూలోనే ఉంచి వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారని, మడొన్నా ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోందని చెప్పారు.
ఇక, తన గానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ పాప్ సింగర్.. 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం కొంచెమైనా తగ్గలేదు. అస్వస్థత కారణంగా వరల్డ్ టూర్‌తో పాటు ఇతర అన్ని ఈవెంట్లను తాత్కాలికంగా నిలిపిపేస్తున్నట్టు మేనేజర్ ప్రకటించారు. ఆ షోలకు చెందిన కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. అనారోగ్యం వల్ల వాంకోవర్‌లో జూన్ 15న ప్రారంభం కావాల్సిన సెలబ్రేషన్ టూర్ కూడా వాయిదా పడింది. ఆసుపత్రిలో మడొన్నాకు తోడుగా ఆమె కూతురు లియోన్ ఉన్నట్టు 'పేజ్ సిక్స్' పత్రిక తెలిపింది.
మడోన్నా బంధువు ఒకరు డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ.. మడోన్నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నామని అన్నారు. ‘గత రెండు రోజులుగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. కుటుంబం ఆందోళనకు గురయ్యింది.. అందుకే శనివారం నుంచి రహస్యంగా ఉంచారు.. అప్పటి పరిస్థితి చూసి మేము ఆమెను కోల్పోతామని భయపడ్డాం’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆయన చెప్పారు.
దాదాపు ఐదు దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తోన్న మడోన్నా.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. గ్రూవే (1985), వ్యోగ్ (1990), హంగ్ అప్ (2005) వంటి అనేక హిట్ అల్బమ్‌లు ఆమె గాత్రం నుంచి వచ్చాయి. సామాజిక, రాజకీయ, లైంగిక, మతపరమైన ఇతివృత్తాలతో సాగే ఆమె ఆల్బమ్‌లు వివాదం, విమర్శకుల ప్రశంసలు రెండింటినీ అందుకున్నాయి.
2000లో గిన్నిస్ వరల్డ్ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బిల్‌బోర్డ్ మ్యాగజైన్ రెండు అత్యధికంగా సంపాదిస్తున్న గాయకురాలుగా మడోన్నాను పేర్కొన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం మడోన్నా నికర విలువ 80 మిలియన డాలర్లు. కన్ఫెషన్స్ టూర్ 200 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఆమె ఆల్బమ్ ఒకటి ఏకంగా 30 కోట్ల కాపీలు అమ్ముడుపోవడం మరో రికార్డు.