ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. జులై 1 నుంచి రాష్ట్రంలో మిగిలిన పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తామని.. దశలవారీగా అన్ని చౌక దుకాణాలకు సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నామని.. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రాగులు, జొన్నలు అందిస్తామన్నారు. అంతేకాదు చిరుధాన్యాల కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని.. వాటిని రైతుల నుంచి న్యాయమైన ధరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో నగదు చెల్లిస్తామని చెప్పారు.
పొరుగు రాష్ట్రాల్లో టమాటా ధర రూ.100 దాటిందని.. రైతుబజారుల్లో కిలో రూ.50కి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల, తిరుపతిలో తూనికలు, కొలతలు, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తామని.. హోటళ్లలో సమస్యలుంటే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. గత టీడీపీ హయాంలో పౌరసరఫరాల శాఖలో నిధులను అడ్డదారిలో పసుపు కుంకుమకు ఉపయోగించారని విమర్శించారు. పౌరసరఫరాలశాఖలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినూత్నమైన మార్పులు తీసుకువచ్చారన్నారు.
చంద్రబాబును సీఎం చేయాలని పవన్ అనుకుంటున్నారని.. ఆయన చంక ఎక్కాలని కోరుకుంటున్నారన్నారు. నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియవన్నారు. చంద్రబాబును నమ్మే స్థితిలో ఎవరు లేరన్నారు.. చంద్రబాబు 2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలన్నీ ఎవరైనా చెబితే రూ.8 లక్షలు ఇస్తానన్నారు మంత్రి.
ప్రభుత్వం గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధరను రూ.16 గా నిర్ణయించింది.. బహిరంగ మార్కెట్లో గోధుమ పిండి కిలో రూ.40గా ఉంది. ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, మన్యం మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి పంపిణీని ప్రారంభించింది. ఒక్కో రేషన్ కార్డుపై రెండు కిలోల లెక్కన కిలో ప్యాకెట్లను రెండింటిని అందిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు రాష్ట్రంలో పేదలకు చిరు ధాన్యాలను అందిస్తున్నారు. మళ్లీ జొన్నలు, రాగుల పంపిణీ చేయనున్నారు. ఒక్కో రేషన్ కార్డు కుటుంబానికి 2 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలని భావిస్తున్నారు. బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. వాటికి బదులు 2 కిలోల రాగులు, జొన్నలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం స్థానికంగానే రైతుల నుంచి చిరుధాన్యాల ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.