కదులుతున్న వందేభారత్ రైలు ఎక్కబోయిన ఓ టీసీ అదృష్టవశాత్తూ మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో జూన్ 26 చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్ రైలు ప్లాట్‌ఫాం నుంచి అప్పుడే కదులుతోంది. అప్పటికే దాని తలుపులు పాక్షికంగా మూసుకుపోగా.. ఇంతలో అదే రైల్లో విధులు నిర్వహించాల్సిన టీసీ పరుగెత్తుకుంటూ ప్లాట్‌ఫాం మీదికి వచ్చారు. కానీ, రైలు క్రమంగా వేగం పుంజుకోవడంతో ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
రైలును ఆపాలని లోకోపైలట్‌కు సైగ చేస్తూ.. దాని వెంబడి పరుగెత్తాడు. సగం మూసుకుపోయిన తలుపుల ద్వారా కోచ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడ ప్లాట్‌ఫామ్ తడిగా ఉండటం వల్ల అదుపుతప్పి జారిపడిపోయాడు. దీనిని గమనించిన అక్కడున్న వారు అప్రమత్తమై టీసీని పక్కకు లాగేశారు. ఒకవేళ, వాళ్లు లాగకపోయి ఉంటే అతడు రైలుకు, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలకే ముప్పు ఏర్పడేది.
జూన్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, ‘ఒకే రైల్లో వెళ్లాల్సిన టీసీ, లోకో పైలట్ మధ్య ఎందుకు సమన్వయం లేదు.. వాకీటాకీ కూడా లేదు.. ప్రతి స్టేషన్‌లోనూ రైలు బయలుదేరే ముందు తనిఖీ చేయాలి కదా’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘సరిగ్గా నేను అనుకున్నదే. ఫ్యాన్సీ కమ్యూనికేషన్ గాడ్జెట్‌ల గురించి మరచిపోండి.. కాంటాక్ట్ నంబర్‌లతో సాధారణ సెల్‌ఫోన్ ద్వారా ఇటువంటివి నిరోధించవచ్చు’అని ఒకరు.. ‘అంత దురదృష్టం! తలుపులు మూసుకున్నప్పుడు కూడా ఎక్కేందుకు అతను అంత తహతహలాడాడు!?’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘ఒక నెల కిందట సూరత్ స్టేషన్‌లో నాకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది.. రైలు కదలకముందే నేను తలుపు పక్కన ఉన బటన్‌ను నొక్కాను.. అక్కడ నుంచి కదలకముందే అదృష్టవశాత్తూ ఎక్కాను’ అని ఓ నెటిజన్ అన్నారు.