పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారని, ఆ కలల్ని మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. ఒకవేళ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. నువ్వు నీ జనసేన పార్టీని మూసుకుని వెళ్తావా? అని పవన్ కళ్యాణ్‌కి సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? అని ఛాలెంజ్ చేశారు.
పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఒక్కచోట కూడా గెలవని వాడు సవాల్ విసురుతుంటే.. తనకు నవ్వొస్తుందని దుయ్యబట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తమని ఓడించడం కాదని, ముందు అభ్యర్థుల్ని వెతుక్కోవాలని హితవు పలికారు. ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈర్ష్య మాటలు ఆపకపోతే.. పవన్ కళ్యాణ్‌కి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అంతకు ముందు కూడా.. పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి ప్రోటోకాల్ లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పని పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆ ముగ్గురు ఏపీ పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు చేయలేని పెట్టుబడిదారుల సదస్సును సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించారని పేర్కొన్నారు. చంద్రబాబు గతంలో సూట్లు వేయించి తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రచారాలు చేసేవారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు అయిన ముఖేష్ అంబానీ, అదానీ వంటి వారిని తీసుకొచ్చారని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు అసలు అంబానీ గానీ, ఇతర పారిశ్రామికవేత్తలు గానీ ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. రౌడీల లెక్కలు తీరుస్తామని చెప్తున్న చంద్రబాబు.. ముందు తన సొంత నియోజకవర్గం కుప్పంలో గెలవాలని సవాల్ విసిరారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టుకొని గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.