ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి ప్రభావంతో కుండపోత వానలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షం పడుతోంది. ఈ నెల కూడా భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాబోయే మూడ్రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.
ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇక 3,4వ తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది.
సోమవారం కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక అదే రోజు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయంది. ఇక 4వ తేదీ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. 4న పల్నాడు, బాపట్ల, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, కృష్ణ, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.
వర్షపాతం 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 వరకు నమోదయ్యే అవకాశం ఉంటే భారీ వర్షసూచన జారీ చేశారు. ఇక 15.6 నుంచి 64.4 మిల్లీమీటర్ల వరకు అయితే మోస్తరు వర్షసూచన ఇస్తారు. అటు 2.5-15.5 మి.మీ మధ్య వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తే స్వల్పం, 0.1-2.4 మి.మీ వరకు ఉంటే అతి స్వల్ప వర్షసూచన వాతావరణశాఖ జారీ చేస్తూ ఉంటుంది. భారీ వర్షాలతో పాటు పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని, వర్షం పడే సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వాన కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఉండవద్దని తెలిపింది.