తిరుమల శ్రీవారికి కనుకలు వెల్లువల వస్తుంటాయి. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు విలువైన కానుక అందజేశాడు. మహేంద్ర ట్రాక్టరు డివిజన్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్క శనివారం రూ.22.90 లక్షల విలువైన మహేంద్ర ఎక్స్ యూవీ 700 వాహనాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించి, వాహన తాళాలు, పత్రాలను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ శ్రీ జానకిరామిరెడ్డి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
భక్తులు సమర్పించే కానుకలతో తిరుమల శ్రీవారి హుండీ కళకళలాడుతోంది. గతేడాది మార్చి నుంచి ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.వంద కోట్లకుపైగా వస్తోంది. జూన్‌లోనూ హుండీ వంద కోట్ల మార్కును దాటిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ 1నుంచి 30వ తేదీ వరకు 20,00,187 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం రూ.166.14 కోట్లు లభించింది. జూన్ 11వ న అత్యధికంగా 92,238 మంది, 10న 88,626 మంది, 17న 87,762 మంది, 25న 87,407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
జూన్ 18న అత్యధికంగా ఒక్కరోజే రూ.4.59 కోట్ల హుండీ ఆదాయం లభించిందని చెప్పారు. జూన్ మాసంలో మెుత్తం పదకొండు రోజుల పాటు రూ. 4 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జనవరిలో రూ.123.07 కోట్లు, ఫిబ్రవరిలో రూ.114.29 కోట్లు, మార్చిలో 120.29 కోట్లు, ఏప్రిల్‌లో రూ.144.12 కోట్లు, మేలో రూ.109.99 కోట్లు హుండీ ఆదాయం లభించింది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా జూన్ నెలలో రూ.166.14 కోట్ల హుండీ ఆదాయం లభించింది.