యూసీసీకి తాము వ్యతిరేకం కాదని, అంతమాత్రాన దానికి తాము మద్దతు ఇవ్వబోమని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి రాజ్యాగంలో ప్రస్తావన ఉందని, కానీ దాని అమలుకు రాజ్యంగం విరుద్ధమని పేర్కొన్నారు. యూసీసీకి సంబంధించి అన్ని కోణాలను బీజేపీ పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని మాయావతి అభిప్రాయపడ్డారు.
‘‘ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మా పార్టీ (బీఎస్పీ) వ్యతిరేకం కాదు. కానీ, దానిని దేశంపై రుద్దేందుకు చేసే ప్రయత్నాన్ని మాత్రం మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేయడం, బలవంతంగా దానిని దేశంపై రుద్దేందుకు ప్రయత్నించడం సరికాదు. ఇదే చట్టాన్ని అన్ని మతాలు, ప్రతి సందర్భంలోనూ వర్తింపజేయాలి. అప్పుడు మాత్రమే దేశం బలోపేతం అవుతుంది’’ అని మాయావతి స్పష్టం చేశారు. రేపు (3న) పార్లమెంటు స్టాండింగ్ కమిటీ యూసీసీపై చర్చించనున్న నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.