ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ. ఆ పార్టీకి చెందిన నేత ఆనం జయకుమార్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమకక్షంలో వైసీపీ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత కోటిరెడ్డి ఉన్నారు. అధికార వైఎస్సార్‌సీపీ తరఫున వెంకటగిరి స్థానం నుంచి గెలుపొందిన ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం టీడీపీకి దగ్గరైన విషయం తెలిసిందే. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లగా.. ఆనం జయకుమార్ రెడ్డి వైసీపీలో రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఆనం సోదరుల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న జయకుమార్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశించారు. తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీని వీడినా (2019 ఎన్నికలకు ముందు) తను వీడనని చంద్రబాబుకు హామీ కూడా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో జయకుమార్‌రెడ్డికి కీలక పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట. టీడీపీలో కీలక పదవి దక్కుతుందని భావించినా.. దక్కకపోవడంతో ఆనం జయకుమార్ రెడ్డి నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, క్లిష్ట సమయంలో పార్టీని వీడిన ఆనం రామనారాయణరెడ్డిని తిరిగి టీడీపీలో చేర్చుకోవడంపై ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.