ఏ రాష్ట్రంలోనైనా 4 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా అక్కడి పాలకపక్షానికి 51 శాతం ప్రజాదరణ సాధ్యమేనా..? అనే ప్రశ్నకు జనరంజకంగా ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి ఇది సంభవమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తోందని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని మతాలు, కులాల ప్రజల మద్దతుతో జనసంక్షేమమే ఏకైక లక్ష్యంగా 2019 నుంచీ ముందుకుసాగుతున్న వైయస్ఆర్ సీపీకి 51 శాతం ప్రజల మద్దతు లభిస్తుందని తాజా సర్వేలో తేలిందన్నారు. ప్రసిద్ధ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీతో కలిసి ఈ జనాభిప్రాయసేకరణ జరిపిందని చెప్పారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాల్లో ఓ స్టోరీని పోస్టు చేశారు.