ఏపీ బీజేపీ చీఫ్ గా కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. ఏపీలోనూ సోము వీర్రాజును మారుస్తారనే చర్చ జరుగుతున్నా.. ఆయన స్థానంలో బీజేపీ నేత సత్యకుమార్ ను నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ నాయకత్వం ఆయన పేరునే ఫైనల్ చేసిందని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ అనూహ్యంగా పురంధేశ్వరి పేరును ఏపీ బీజేపీ చీఫ్ గా ఫైనల్ చేసింది ఆ పార్టీ నాయకత్వం. నిజానికి సత్యకుమార్ పేరును ఏపీ బీజేపీ చీఫ్ గా బీజేపీ హైకమాండ్ ఓకే చేసిందనే వార్తలు రాగానే.. ఇక టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపు ఖాయమే అనే ప్రచారం సాగింది.
వైసీపీకి వ్యతిరేకిగా ముద్రపడ్డ సత్యకుమార్ పేరు తెరపైకి రాగానే.. ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయ పోరాటం మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు చర్చలు జరిపిన తరువాత.. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుకు దాదాపుగా లైన్ క్లియర్ అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా పురంధేశ్వరి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపిక చేయడంతో ఏపీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.