రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని సీఆర్డీఏ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. త్వరలోనే ఆయా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ఈ వివరాలను లిఖిత పూర్వకంగా కోర్టు ముందు ఉంచాలన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాజధాని రైతులకు వార్షిక కౌలు సకాలంలో చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.