డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలు గతంలో బాగా ప్రబలిన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రి విడదల రజిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై శుక్రవారం ఏపీఐఐసీ భవనంలో ఆమె సమీక్షించారు. జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనదేనని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉండాలన్నారు. వెంటనే ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు ఈ సర్వేలో పాల్గొనేలా క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ నెల 10 నుంచి ఈ సర్వే ప్రారంభం కావాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యశాఖ సిబ్బంది ముందుకు వెళ్లాలన్నారు. డెంగీ, మలేరియా టెస్టులకు సంబంధించి విలేజ్ క్లినిక్స్‌లోనే కిట్స్ అందుబాటులో ఉండాలన్నారు. వ్యాధుల ప్రభావం ఉండే మూడు నెలల పాటు అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. ప్రజలకు అందుతున్న నీరు సురక్షితంగా ఉండేలా పర్యవేక్షిస్తే మంచిఫలితాలు వస్తాయన్నారు.