ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు నక్కలు, తోడేళ్ల పాలన కావాలా? రైతు రాజ్యం కావాలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 07:36 PM

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అకౌంట్లలో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శనివారం వైఎస్సార్‌ రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 2022 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బీమా పరిహారం రూ.1,117 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.


ఐదేళ్లలో బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ. 3,411 కోట్లు మాత్రమే అని సీఎం జగన్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు అని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టామని చెప్పారు. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30,985 కోట్లు రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.


చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారని సీఎం జగన్ తెలిపారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. చంద్రబాబు కరువును పారద్రోలాడని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నిసిగ్గుగా అసత్యాలు రాశాయని సీఎం జగన్ దుయ్యబట్టారు. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు ఆర్బీకే రూపంలో రైతుకు తోడుగా ఉంటున్నామని తెలిపారు.

ఏ సీజన్‌లో పంట నష్టం జరిగినా ఆ సీజన్‌ ముగియక ముందే పరిహారం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉందని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ. 58,767 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ. 7,633 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.ఇక, రాష్ట్రంలో రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్‌ ఇచ్చేలా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించామని.. పశువుల కోసం 340 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ను తీసుకొచ్చామని తెలిపారు.


ఇక, మనకు పాడి పంటలు ఉండే పరిపాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా అని సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా అని అన్నారు. రైతుకు తోడుగా ఆర్బీకే వ్యవస్థ కావాలా అని తెలిపారు. దళారీ వ్యవస్థ కావాలా.. పేదల ప్రభుత్వం కావాలా.. పెత్తందారుల ప్రభుత్వం కావాలా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గతంలో పేద ప్రజలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారని.. ఇలాంటి నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారని తెలిపారు. వీళ్లలా తనకు అబద్ధాలు చెప్పడం రాదని సీఎం జగన్ చెప్పారు.













SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com