తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలోకి రావాలని బీజేపీ పిలవకపోయినా చేరేందుకు టీడీపీ ఉవ్విళ్లూరుతోందని సెటైర్లు వేఆరు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పిలవకపోయినా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్లాలని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఉవ్విళ్లూరుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు పిలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు ఉన్నారని సెటైర్లు వేశారు. సమావేశానికి పిలుస్తారా.. వెళ్తారా అన్నది ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయమని అన్నారు. ఒకేవేళ అధికారం కోసమే టీడీపీ, బీజేపీ మరోసారి కలిసే ప్రయత్నం చేస్తే ఆ కూటమికి రంగు, రుచి, వాసన ఉండదన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టింది చంద్రబాబే అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2014లో బీజేపీకి పార్ట్‌నర్‌గా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఒక్కటి కూడా సాధించుకోలేక పోయారన్నా్రు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండిపెండెంట్‌గా ఉండి కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకుని రాగలుగుతున్నారని, అవసరమైనప్పుడు ఏ అంశంపై అయినా అభిప్రాయాలను నిర్భయంగా చెప్పగలుగుతున్నారని పేర్కొన్నారు.
ఇక, 2014లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే చంద్రబాబు మళ్లీ ఇప్పుడు వల్లెవేస్తున్నారని సజ్జల అన్నారు. అంటే ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఘోరంగా మోసం చేసినట్లే కదా అని ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు మోసం చేసి అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అని బాబు, లోకేష్ అనుకుంటారని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతినే అక్రమంగా ఉంచుకున్నారని ముద్ర వేసింది టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వ హననం చేసే అలవాటు టీడీపీకే ఉందని, రాజకీయాన్ని బురదగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ తానులోని ముక్కే అని.. విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని సజ్జల వ్యాఖ్యానించారు.