రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లోని ప్రవాసీ భారతీయులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’ సేవలు ఇక ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం కానున్నాయని తెలిపారు. ‘ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.. త్వరలోనే ఈఫిల్ టవర్ వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయి.. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీని ఇక్కడ చెల్లింపుల కోసం వాడవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో యూపీఐను అనుమతించడం వల్ల భారతీయులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గజిబిజిగా ఉన్న ఫారెక్స్ కార్డ్‌లు వినియోగం, నగదును తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నివారిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను 2016 ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు దేశంలో విశేషంగా ప్రాధాన్యం పొందాయి. యూఏఈ, భూటాన్, నేపాల్‌లో వంటి దేశాల్లోనూ యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక, గతేడాది ఎన్పీసీఐ, ఫ్రాన్స్‌లు ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ లైరా అని పిలిచే ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అలాగే, ఈ ఏడాది యూపీఐ, సింగపూర్‌కి చెందిన PayNow మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల్లోని వినియోగదారులు దీని ద్వారా లావాదేవీలకు అనుమతించారు. అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఎన్‌పీసీఐ చర్చలు జరుపుతోంది.
కాగా, పారిస్‌లో మోదీ బస చేసిన హోటల్ బయట గుమిగూడిన ప్రవాసీ భారతీయలు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో ముచ్చటించిన మోదీ.. ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాలు, కష్టించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ఇక, ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా తొలిరోజు ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బోర్న్, సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్-ఫ్రాన్స్ మధ్య బహుళ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త మార్గాలపై చర్చించారు.