చరిత్రలో కనీవినీ ఎరుగుని రీతిలో యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీ నగరం అతలాకుతలం అవుతోంది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యవసరం కాని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీ సెక్రటేరియట్‌ను కూడా వరద నీరు చుట్టుముట్టింది. తాజాగా, సుప్రీంకోర్టు భవనం వద్దకు కూడా వరద నీరు చేరుకుంది. గురువారం రాత్రికి నదిలో వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ శుక్రవారం ఉదయం ప్రమాదకర స్థాయిని దాటేసింది. దీంతో ఎటు నుంచి ముప్పు ముంచుకొస్తుందోనని ఢిల్లీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమునా నది నీటి మట్టం 208.40 మీటర్లకు చేరింది. వరద ముప్పు ప్రాంతాల్లో ఢిల్లీ మంత్రి అతీశ్ పర్యటించారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ ఇంజినీరింగ్ విభాగాలు సహకరిస్తున్నాయని, తమ బృందం రేయింబవళ్లూ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. పరిస్థితి మరో 10-12 గంటల ఇలాగే ఉంటుందని, తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
‘వర్షం కారణంగా నీరు చేరడం లేదు.. నిన్న ఈ పరిస్థితిని చూసిన ప్రాంతాల్లో డ్రైన్లన్నీ నిండిపోయాయి. ఐటీఓ నుంచి పాత ఢిల్లీలోని కాలువలలోకి నీరు ప్రవహిస్తుంది. అయితే ఎర్రకోట చుట్టూ వరదల కారణంగా పాత ఢిల్లీలోని అన్ని కాలువలు నిండిపోయాయి. రెండోది హత్నికుండ్ నుంచి పెద్ద మొత్తంలో నీరు ఢిల్లీకి చేరుతుంది.. ఒక విధంగా ఢిల్లీ రిజర్వాయర్‌ను తలపిస్తోంది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
యమునా నదిలో మళ్లీ నీటి మట్టం పెరగడంతో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. గీతా కాలనీ ఫ్లైఓవర్ నుంచి రాజ్‌ఘాట్, ఐఎస్బీటీ, కశ్మీర్ గేట్ వరకూ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నదిలో గురువారం రాత్రికి వరద 67,000 క్యూసెక్కులకు తగ్గింది. నీటిని వదలకుండా ఆపడం సాధ్యం కాదని హరియాణా ప్రభుత్వం తేల్చిచెప్పింది.
యమునా నదిపై ఎలాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేవు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని డాక్‌పత్తర్, హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజీలు మాత్రమే ఉన్నాయి. వర్షాకాలంలో నది నీరు వృథాగానే కిందికి పోతుంది. ఢిల్లీకి 180 కి.మీ. దూరంలోని హత్నికుండ్ నుంచి గరిష్టంగా 3.5 లక్షల క్యూసెక్కుల మేర వచ్చిన నీరే ఇప్పుడు ఢిల్లీ వరదలకు కారణమవుతోంది. నదిలో ఆక్రమణలు, పూడిక పెరిగిపోవడం, 22 కి.మీ. దూరంలో ఏకంగా 20 వంతెనల్ని నిర్మించడం వంటివి కూడా వరదలకు హేతువుగా పరిణమించాయి.