పబ్జీలో పరిచయమైన యువకుడి కోసం భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌ను తిరిగి తమ దేశానికి పంపకపోతే 26/11 తరహా ఉగ్రదాడులు తప్పవని ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి గుర్తుతెలియన వ్యక్తి ఫోన్ చేసిన బెదిరించినట్టు అధికారులు వెల్లడించారు. జులై 12న ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్టు తెలిపారు. ఉర్దూలో మాట్లాడిన ఆ వ్యక్తి.. ముంబయిలో 2008 నవంబరు 26 తరహాలో ఉగ్రదాడి జరుగుతుందని బెదిరించాడు. దీనికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
దీనిపై ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, క్రైం బ్రాంచ్ కూడా రంగంలోకి దిగిందని చెప్పారు. ఈ బెదిరింపు కాల్ యాప్ ద్వారా వచ్చినట్టు గుర్తించిన పోలీసులు.. దాని ఐపీ అడ్రస్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా (25)తో పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌కు పబ్జీలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఈ ఏడాది మార్చిలో మొదటిసారి నేపాల్‌లో ప్రత్యక్షంగా కలుసుకుని, అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె పాకిస్థాన్‌కు వెళ్లిపోయి.. తిరిగి కరాచీ నుంచి తన నలుగురు పిల్లలను తీసుకుని మేలో నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది.
జులై 4న ఆమెతో పాటు యువకుడ్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. గతవారం వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీమా, సచిన్‌లు తాము ప్రేమించుకున్నామని, తమ వివాహానికి అనుమతి ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని మీడియా ముందు అభ్యర్థించారు. తనను తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెబుతోంది. కానీ, ఆమె భర్త మాత్రం లబోదిబోమంటున్నాడు. తన భార్యను తిరిగి తన వద్దకు చేర్చాలని భారత ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.
పాకిస్థాన్ సింధు ప్రావిన్సులు ఖైరాపూర్ జిల్లాకు చెందిన సీమా హైదర్ లకు యూపీకి చెందిన సచిన్‌తో పబ్‌జీ గేమ్‌లో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం స్నేహంగా మారి.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే, సీమాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, ప్రియుడి కోసం ఆమె ఈ ఏడాది మార్చిలో కరాచీ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా నేపాల్‌కు చేరుకుంది. సచిన్, సీమా మొదటిసారి ప్రత్యక్షంగా నేపాల్‌లోనే కలుసుకున్నారు. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు.