వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై గ్రామ వాలంటీర్‌ని పోటీకి పెట్టి ఓడిస్తామని మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాననే సవాల్‌ని స్వీకరిస్తే.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ గ్రామ/ వార్డు వాలంటీర్‌ని నిలబెట్టి ఓడిస్తామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్‌ని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎవరూ అవసరం లేదని, కేవలం వాలంటీర్ చాలని ఎద్దేవా చేశారు. తమ ఛాలెంజ్‌ని స్వీకరించే దమ్ము పవన్ కళ్యాణ్‌కి ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, వాలంటీర్లను చాలా బాధించాయని చెప్పారు. వాలంటీర్ల వల్ల సచివాలయ సంస్థలు సక్సెస్ కావడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకనే.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని జోగి రమేష్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై పవన్ కళ్యాణ్‌కి ప్రేమాభిమానం ఉంటే.. పొత్తులకు పోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. అసలు పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్ గురించి, మహిళల భద్రతపై మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన కాగితాలు చూసి పవన్ కళ్యాణ్ చదువుతున్నారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్‌కి ఏపీతో సంబంధమే లేదని మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. ఇక పురోహితులకు రిటైర్మెంట్ అనేదే లేదని.. వారు ఎక్కడైనా పౌరహిత్యం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అన్నవరంలో పురోహితులను వేలంపాట వేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతకుముందు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కూడా మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. వైసీపీ ఇస్తున్న నవరత్నాలు, జగన్ చేస్తున్న సంక్షేమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని చెప్పారు. గడప గడపకు వెళ్లి పథకాలు గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి దమ్ము, దైర్యం, చీము నెత్తురు ఉంటే.. ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.