ఏపీలో కొనసాగుతున్న వానలు.. మరో మూడు రోజులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆవర్తనం బలహీనపడగా.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. అయితే మూడు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వానలు ఊపందుకున్నాయి. కోస్తాతో పాటుగా రాయలసీమలోనూ మూడు రోజులు పాటూ వర్షాలు. వర్షాలు ఊపందుకోవడంతో వ్యవసాయ పనులు ముమ్మరం.
ఏపీలో వర్షాలు పడుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర కోస్తాంధ్ర, దాని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. అంతేకాదు మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. అక్కడక్కడా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు పడతాయంటున్నారు. అలాగే విజయనగరం, పశ్చిమగోదావరి, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.
కోస్తా ప్రాంతంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో అత్యధికంగా 6.4 సెంటీమీటర్లు, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 6.2, కాకినాడ జిల్లా పత్తిపాడులో 3.3, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 2.9, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 2.8, ఏలూరు జిల్లా పోలవరంలో 2.4, ఏలూరు జిల్లా భీమడోలులో 2.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 5.6 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా నగరిలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు ఊపందుకోవడంతో రైతులు వ్యవసాయం పనులు ముమ్మరం చేశారు. వాన ముసురుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కొన్ని జిల్లాల్లో రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణకు భారీ వర్షసూచన
ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గత 24 గంటల్లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. తెలంగాణలో కూడా వ్యవసాయం పనుల్ని రైతులు ముమ్మరం చేశారు.