అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని రాజధాని రైతులు ఆదివారం మందడం దీక్షా శిబిరంలో సుదర్శన యాగాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిబియా మాజీ నేత గడాఫికి ఏ ఖర్మ పట్టిందో ఏపీలో జగన్కు అదే గతి పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్తే రాష్ట్ర రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్ధితి ఉందన్నారు. అమరావతి రైతాంగం ఉసురు, మహిళల కన్నీటికి వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి పడేస్తారన్నారు. పోయిన అమరావతిని, ఆర్-5 జోన్ స్థలాలను తిరిగి తెచ్చుకోవడానికి సుదర్శన యాగం చేస్తున్నట్లు రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. పేద ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే జగన్కు అమరావతి పేదలు కన్పించటం లేదా అని వారు ప్రశ్నించారు.