వైసీపీ సర్కార్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి యుద్దం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మను కలిశారు. అనంతరం రఘురామ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష ఓట్ల తొలగింపు, అధికార పార్టీ దొంగ ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆగస్ట్ తొలివారంలో విశాఖలో పర్యటించి రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమవుతానని ధర్మేంద్రశర్మ చెప్పారన్నారు. దొంగ ఓట్ల నమోదుపై మరింత సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి తనను కోరారని రఘురామ వెల్లడించారు. ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో ఎలాంటి తప్పులు జరిగినా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.