వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సోమవారం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అప్పులు తెచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర హక్కులు సాధించడంలో లేదని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. విభజన చట్టం హామీల అమలు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదేళ్ల రాష్ట్ర విభజన చట్ట కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగుస్తున్నా.. ఈ ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడలేకపోయిందని దుయ్యబట్టారు. వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఊరూరా తిరిగి ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నాలుగేళ్లలో రాష్ట్రానికి కనీసం ఒక ప్రాజెక్టు గానీ, ఒక సంస్థను గానీ తీసుకొచ్చారా? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయ్‌దేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావుతో హైదరాబాద్‌లో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో పూర్తిగా గాడి తప్పిన శాంతిభద్రతలు, విధ్వంసకర పాలనపై పార్లమెంట్‌లో లేవనెత్తాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పరిస్థితులపై స్వయంగా కేంద్ర మంత్రులే ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను పార్లమెంటు వరకు తీసుకెళ్లాలన్నారు. అక్రమ కేసులు, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా తప్పుల మీద తప్పులు చేసి జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ఎలా నాశనం చేసిందో కూడా పార్లమెంట్‌లో చర్చించాలని సూచించారు.
పీపీఏ హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వ సూచనలు పక్కన పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రివర్స్ నిర్ణయాల వల్ల పోలవరానికి జరిగిన నష్టాన్ని చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. నదుల అనుసంధానం వల్ల జరిగే లబ్ధిని ప్రత్యేకంగా పార్లమెంటులో చర్చించాలన్నారు. టీడీపీ హయాంలో నదుల అనుసంధానంపై చేసిన ప్రయత్నాలు, వాటి వల్ల వచ్చే ఫలితాలను కూడా చర్చకు తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో రానున్న బిల్లులపై ఆయా సందర్భాలకు అనుగుణంగా పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.