రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం గుంటూరులో క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. గుంటూరు జిల్లాలో పుట్టిన వ్యక్తిని కావడంతో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాజకీయాల వైపు అడుగులు వేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుంటే తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని ఇటీవలే అంబటి రాయుడు అన్నారు. అక్షయపాత్ర ద్వారా పిల్లలకు ఆహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని పేర్కొన్నారు.
కొన్నేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పేశారు. ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పొగడ్తలు కురిపించారు. ఐపీఎల్‌లో అంబటి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచిన తర్వాత ఆ కప్‌తో సీఎం జగన్‌ను కలిశారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని జోరుగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత అంబటి రాయుడు తన పొలికల్ ఎంట్రీ గురించి స్పష్టంగా ఏమీ చెప్పకుండానే స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.