పోలీసు అధికారుల పోస్టింగుల మీద శ్వేతపత్రం ఇవ్వగలరా డీజీపీ? ప్రతిపక్షపార్టీ పోలీసు పోస్టింగులపై చేసిన ఆరోపణలు అసత్యం అంటూ శ్వేతపత్రం ఇవ్వగలరా? పోలీసులకు సమర్ధత, సామర్థ్యం చూసి పోస్టింగులు ఇస్తారా? కులాలు చూసి పోస్టింగులు ఇస్తారా? ఏ ప్రాతిపదికన పోస్టింగులు ఇస్తున్నారు డీజీపీ? అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుదు వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.
'ప్రధానమైన పోస్టింగుల్లో రెడ్లు ఎంతమంది? మిగిలిన కులాలు ఎంత మంది? వీరిలో... సస్పెన్షన్ లో ఎంతమంది రెడ్డి అధికారులు ఉన్నారు? ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు? వీటిపై శ్వేతపత్రం ఇవ్వగలరా డీజీపీ?' అంటూ ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని పోలీసు డిపార్ట్ మెంట్ లో కులవివక్షను అధికార పార్టీ వైసీపీ పెంచి పోషిస్తోందని రామయ్య ఆరోపించారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, పోలీసుశాఖ తమ ఉనికిని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ చట్టపరంగా వ్యవహరించడం లేదన్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలన, అధికార పార్టీకి పోలీసు వ్యవస్థకు వత్తాసు పలకడమేనని తేల్చిచెప్పారు. గతంలో ఎన్నడూ ఇంత దిగజారిన పరిస్థితులు పోలీసుశాఖ లో కనిపించలేదని, అధికారపార్టీ పోలీసు శాఖను తన గుప్పిట్లో పెట్టుకుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.