వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 175 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి తద్వారా రూ.50 కోట్ల బ్యాంకు రుణం పొందారు అనే అభియోగంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాల్పూరి ఆగ్రోటెక్, శ్రీవత్సవ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీల ద్వారా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ మార్గాల విక్రయ పత్రాలు సృష్టించి తద్వారా బ్యాంకు రుణం పొందారు అని వినుకొండకు చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి తద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి బ్యాంకు నుంచి రుణం పొందారని హైకోర్టులో న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు.. ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ.. కేసు విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.