ఏపీలో వర్షాలు కొనసాగుతండగా.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి.ఒకటి, రెండు రోజులపాటు మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలోనే అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే రుతపవన ద్రోణి తూర్పు భాగం కటక్ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాల్లో మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి, రెండు చోట్ల ఉండొచ్చని.. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు.
మంగళవారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఐఎండి అంచనా ప్రకారం వాయువ్య బంగాళాఖాతంపై ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. గురువారం శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు.