ఏపీలో నాలుగు జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) ఛైర్మన్‌లను ప్రభుత్వం మార్చింది. రాష్ట్రంలోని 13 డీసీసీబీల ఇంఛార్జ్ కమిటీల పదవీకాలం మంగళవారం ముగియగా.. వీరిలో తొమ్మిదింటిని పాతవాటినే కొనసాగించారు. మిగిలిన నాలుగింటిలో ఛైర్మన్లను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నలుగురికి 2024 జనవరి 17 వరకు.. లేని పక్షంలో ఈ కమిటీలకు ఎన్నికలు నిర్వహించే వరకూ పదవుల్లో ఉంటారు. ఈ రెండింటలో కూడా ఏది ముందైతే, అంతవరకే పదవీకాలం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదవీకాలాన్ని పొడిగించిన తొమ్మిది కమిటీలకూ ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు.
విశాఖపట్నంలో డీసీసీబీ ఛైర్‌పర్సన్‌గా కోలా గురువులుకు అవకాశం కల్పించారు. మొన్నటి వరకు ఈ పదవిలో చింతకాయల సన్యాసిపాత్రుడి భార్య అనిత ఉన్నారు. కోలా గురువులు ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కర్నూలు డీసీసీబీ ఛైర్‌పర్సన్ పదవిని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి భార్య విజయ మనోహరికి ఇచ్చారు. కృష్ణా డీసీసీబీ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు స్థానంలో తాతినేని పద్మావతిని నియమించారు. పెనమలూరుకు చెందిన ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేశారు. ఇప్పుడు ఆమెకు పదవి కట్టబెట్టారు. ప్రకాశం డీసీసీబీ ఛైర్మన్‌గా మారుతిప్రసాద్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఛైర్మన్ పదవి నుంచి మాదాసి వెంకయ్యను తప్పించారు.
డీసీసీబీ ఛైర్మన్ పదవులు మాత్రమే కాదు.. మార్క్‌ఫెడ్, ఆప్కాబ్ పర్సన్ ఇంఛార్జ్‌ల కమిటీల పదవీకాలాన్ని కూడా మరో ఆర్నెల్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్‌ఫెడ్ కమిటీని జనవరి 28 వరకు, ఆప్కాబ్ కమిటీని జనవరి 1 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఆయా జిల్లాల్లో పార్టీలోని సమీకరణాల ఆధారంగా ఈ పదవుల్లో నియమించారు.