పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... బీసీలకు సంబంధించి వైఎస్‌ఆర్‌సీపీ మొదట్నుంచీ చాలా స్పష్టమైన విధివిధానాలతో ఉంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఏ రకంగానైతే చట్టసభల్లో రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నారో...అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్‌ను అమలులో ఉంది. అదే మాదిరిగా దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రస్తుతం 27 శాతానికి పరిమితమైంది. జనాభా ప్రాతిపదికన చూస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ తరఫున సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.