ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌లో తొలిసారి కలుసుకున్న సచిన్, సీమా,,,నకిలీ పేర్లతో రూమ్ తీసుకుని వారం రోజులు బస

national |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 09:06 PM

పబ్జీ ప్రేమ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల అదుపులో ఉన్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌.. విచారణలో కొత్త విషయాలు వెల్లడిస్తోంది. భారత్‌కు రాకముందు సచిన్ మీనా తనను మొదటి సారి నేపా‌ల్‌లో కలిసినట్లు పేర్కొంది. అక్కడ తమ పేర్లతో కాకుండా నకిలీ పేర్లతో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. అక్కడే వారు వారం రోజుల పాటు ఉన్నట్లు తేల్చారు. ఈ మేరకు నేపా‌ల్‌లోని హోటల్ ఓనర్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇప్పటికే సీమా హైదర్ పాకిస్థాన్ ఏజెంట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. నకిలీ పేర్లతో రూమ్ తీసుకోవడంతో వారి అనుమానం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


పబ్జీలో పరిచయమై.. ప్రేమించుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌ యువకుడు సచిన్‌ మీనా, పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ మొట్టమొదటిసారిగా నేపాల్‌లో కలిసినట్లు తెలుస్తోంది. వారిద్దరూ భారత్‌లోకి ప్రవేశించడానికి ముందు వారం రోజుల పాటు నేపాల్ రాజధాని ఖట్మండులోని ఓ హోటల్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని ఆ ఖాట్మండులోని హోటల్‌ ఓనర్ కూడా స్పష్టం చేశాడు. వారిద్దరూ ఖాట్మండులో ఉన్న న్యూ వినాయక హోటల్‌ ఓనర్ గణేశ్‌ తాజాగా మీడియాకు వెల్లడించాడు.


సచిన్‌ మీనా, సీమా హైదర్‌లు తొలుత మార్చి నెలలో తమ హోటల్‌కు వచ్చినట్లు హోటల్ ఓనర్ గణేశ్ తెలిపాడు. అక్కడే వారం రోజుల పాటు ఉన్నట్లు పేర్కొన్నాడు. హోటల్‌ గది నుంచి సచిన్, సీమా సాయంత్రం మాత్రమే బయటికి వచ్చేవారని చెప్పాడు. మొదట హోటల్‌కు వచ్చిన సచిన్.. తన పేరు శివాన్ష్ అని రూమ్ బుక్ చేసుకున్నాడని.. తర్వాతి రోజు తన భార్య వస్తుందని చెప్పినట్లు తెలిపాడు. అయితే సీమా హోటల్‌కు వచ్చినపుడు ఒంటరిగానే ఉందని తెలిపాడు. వారు హోటల్‌ రూమ్‌ను ఖాళీ చేయడానికి ఒకరోజు ముందు సీమా వెళ్లిపోయిందని.. ఆ తర్వాతి రోజు సచిన్‌ వెళ్లాడని చెప్పాడు. వారం రోజులు ఉన్న సచిన్.. హోటల్‌ అద్దెను భారతీయ కరెన్సీలో చెల్లించినట్లు హోటల్ ఓనర్ గణేశ్‌ వెల్లడించాడు.


ఇక ఈ కేసులో విచారణ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు.. మార్చి 10 వ తేదీన గోరఖ్‌పూర్ నుంచి ఖాట్మండుకు వెళ్లిన సచిన్.. అక్కడ హోటల్ రూమ్ బుక్ చేసినట్లు వెల్లడించారు. అయితే సచిన్‌ మీనాను కలిసేందుకు సీమా.. షార్జా మీదుగా నేపాల్‌ చేరుకుందని చెప్పారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న వారిద్దరూ భారత్‌కు వచ్చినట్లు గుర్తించారు. సచిన్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు పాక్‌లో ఉన్న కొత్త ఇంటిని సీమా అమ్మినట్లు పోలీసుల విచారణలో బయటికి వచ్చింది. అయితే ఖాట్మండులో రూమ్ ఖాళీ చేసినపుడు సీమా ఒక్కతే ఉందని అక్కడి హోటల్‌ ఓనర్ చెప్పడంతో ఆ సమయంలో మరి నలుగురు పిల్లలు ఎక్కడ ఉన్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు.


మరోవైపు సీమాను పాకిస్థాన్‌కు పంపించాలని సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ఆమె భర్త గులాం హైదర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు. దీంతోపాటు సీమా హైదర్‌ను పాకిస్థాన్‌కు పంపించకపోతే 26/11 ముంబై తరహా దాడులు జరుగుతాయని.. ముంబై పోలీసులకు దుండగుల నుంచి ఒక బెదిరింపు లేఖ రావడం సంచలనంగా మారింది. మరోవైపు.. సీమా హైదర్ సోదరుడు పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడని ఆమె భర్త గులాం హైదర్‌ వెల్లడించాడు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ ఏటీఎస్‌ పోలీసులు చేసిన విచారణలో మాత్రం తన సోదరుడు పాక్‌ సైన్యంలో చేరాలని అనుకున్నాడని సీమా చెప్పినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa