ఏపీలో ఓటర్ల సమగ్ర సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్స్(బీఎల్‌వోలు) తమ బూత్ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేపట్టనున్నారు. ఇంట్లోవారి వివరాలను తెలుసుకుని వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువకులు ఓటుకు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే ఓటర్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. మార్చిలో ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను తయారుచేసే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అందులో భాగంగానే సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టింది.
ఈ సర్వే ద్వారా దొంగ ఓట్లను గుర్తించి తొలగించనున్నారు. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారు. ఆ ఓట్లను గుర్తించి జాబితా నుంచి తొలగించనున్నారు. కొంతమందికి వేరే వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంది. దీంతో ఏ ప్రాంతంలో ఓటు హక్కు ఉంచాలనేది తెలుసుకుని మిగతా ప్రాంతంలో ఉన్న ఓటు హక్కును తొలగించనున్నారు. అలాగే మరణించినవారిని గుర్తించి వారి ఓటు తొలగించడం, ఓటర్ల అభ్యర్థన మేరకు ఒకచోట నుంచి మరో చోటకు ఓటును మార్చడం, ఓటర్ ఐడీలో పేరు, అడ్రస్, నియోజకవర్గం, ఫొటో లాంటివి ఏమైనా తప్పులు ఉంటే సరిచేయడం లాంటివి చేయనున్నారు.
ఆగస్టు 21 వరకు బీఎల్‌వోల సర్వే కొనసాగనుంది. ఈ సర్వే ద్వారా నకిలీ ఓట్లను గుర్తించడంతో పాటు ఐడీ కార్డులో స్పష్టత లేని ఫొటోలను తొలగించి మంచి ఫోటోలు ఏర్పాటు చేయనున్నారు. ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తారు. దీంతో పాటు 100 ఏళ్లు నిండిన ఓటర్లను గుర్తించడం, సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం లాంటివి చేయనున్నారు. ఏపీలో నకిలీ ఓటర్లను అధికార వైసీపీ పెద్ద సంఖ్యలో చేర్చుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచింది. ఈ సందర్భంగా ఏపీలోని దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని, వాటిని గుర్తించి జాబితా నుంచి తొలగించాలని సూచించింది. ఈ క్రమంలో సమగ్ర సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా ఏపీలో మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 17న ఓటర్ల మసాయిదాను విడుదల చేస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.