ఏపీలో బాలికపై ముగ్గురు వ్యక్తులు నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల చిన్నారి ఈ విషయాన్ని బయటపెట్టడం, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒక వ్యక్తి బాలికకు అన్న వరుసయ్యే సమీప బంధువు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు పోక్సో చట్టం కూడా కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లా నందివాడ మండలానికి చెందిన ఓ పదేళ్ల బాలిక ఏలూరు జిల్లాలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌లో చదువుతోంది. బాలిక కుటుంబం కృష్ణా జిల్లాలోని నందివాడ మండలంలో చేపల చెరువులపై కాపాలా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తమ కుటుంబసభ్యులు ఉండటంతో అక్కడే హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. బాలిక కుటుంబానికి సమీప బంధువైన అన్న వరుసయ్యే రాంబాబు(19) అదే గ్రామంలో ఉంటున్నాడు. బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించి తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే ఇంటి యజమాని స్నేహితుడైన షేక్ ఖాదర్(45)కు ఈ విషయం తెలియడంతో.. అతడు కూడా పలుమార్లు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
బాలికపై అత్యాచార ఘటనను ఇంటి యజమాని కుమారుడైన మైనర్ బాలుడు(13) చూశాడు. దీంతో అతడికి రాంబాబు, ఖాదర్ కలిసి అశ్లీల చిత్రాలు చూపించి బాలికపై అత్యాచారం చేసేలా ప్రోత్సహించారు. ఈ ముగ్గురు నాలుగు నెలలుగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇటీవల బాలికను తీసుకెళ్లేందుకు హాస్టల్ వద్దకు రాంబాబు వెళ్లాడు. అతడిని చూసి బాలిక భయంతో వణికిపోతూ కనిపించింది. ఇది గమనించిన హాస్టల్ వార్డెన్.. బాలికను ప్రశ్నించారు. గట్టిగా ప్రశ్నించగా చివరకు జరిగిన విషయాలను బాలిక బయటపెట్టింది.
హాస్టల్ వార్డెన్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు రాంబాబు, ఖాదర్, మైనల్ బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.