కాకినాడ మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. 20 కేజీల బరువు గల కచిడి చేప దొరికింది. కుంభాభిషేకం రేవులో మత్స్యకారుల వలలో ఈ చేప చిక్కింది. ఈ చేపను రూ. 3.10 లక్షలకు మత్య్సకారులు విక్రయించారు. చేపలను కొనుగోలు చేసే వ్యాపారులు దీనిని కొనుగోలు చేశారు. అత్యంత అరుదుగా లభించే కచిడి చేపలో అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే ఈ చేపలకు లక్షల్లో డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
అనేక వ్యాధులకు తయారుచేసే ఔషధాల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో డాక్టర్లు ఆపరేషన్ చేసిన అనంతరం వేసే కుట్లుకు దారం తయారు చేస్తున్నారు. ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషధంగా ఈ చేప ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో ఈ చేపకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, కొనుగోలు చేసేందుకు పోటీ పడతారని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే గతంలోనూ ఏపీలోనే అనేకసార్లు కచిడి చేపలు మత్స్యకారులకు దొరికాయి. వీటిని విక్రయించడం వల్ల మత్స్యకారులకు భారీ ఆదాయం కూడా వచ్చింది. దీని వల్ల రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోాయారు. కానీ ఇవి అప్పుడప్పుడు మాత్రమే వలలో పడుతూ ఉంటాయని, దొరికితే అదృష్టం వరించినట్లేనని మత్స్యాకారులు చెబుతున్నారు. గతంలోనూ గోదావరి జిల్లాల్లో కచిడి చేపలు పలుమార్లు దొరికాయి. గతంలో రూ.4 లక్షలకు ఒక చేప ఇలాగే అమ్ముడుపోయింది.