మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. ఈశాన్య రాష్ట్రంలో గత రెండు నెలలుగా జరుగుతోన్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, స్వాతంత్ర సమరయోధుడి భార్యను సజీవదహనం చేసిన అమానుష ఘటన బయటపడింది. మే 28న ఈ ఘటన చోటుచేసుకుంది. కక్‌చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడి భార్య అయిన ఇబేటోంబి (80)ని దుండగులు సజీవంగా తగులబెట్టారు. బాధితురాలి భర్త చురాచంద్ సింగ్ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన తన 80వ ఏట మరణించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా సత్కారం కూడా అందుకున్నారు.
మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణల్లో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో సెరౌ ఒకటి. మే 28 తెల్లవారుజామున దుండుగులు గ్రామంపై దాడిచేయడంతో.. తక్షణమే ఇంటి నుంచి పారిపోండని తన కుటుంబసభ్యులకు ఇబేటోంబి సూచించింది. వయోభారంతో ఆమె మాత్రం ఇంటిలోనే ఉండిపోయారు. ఆ ఇంటికి దుండగులు బయటి నుంచి గడియపెట్ట తాళంవేసి అనంతరం నిప్పంటించారు. ఆమెను కాపాడేందుకు కుటుంబసభ్యులు వచ్చేసరికే ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. ఇబెటోంబీ మనవడు ప్రేమ్‌కంఠ (22)కు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. తన బామ్మను రక్షించే ప్రయత్నంలో అతడికి బుల్లెట్ గాయాలయ్యాయి.
ప్రేమ్‌కంఠ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. నాయనమ్మను కాపాడే ప్రయత్నంలో తాను త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని, చేయి, తొడల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని తెలిపాడు. ‘గ్రామంపై దాడి జరిగిందని తెలియగానే మమ్నల్ని అందర్నీ ఇంటి నుంచి వెళ్లిపోయి. కొద్ది సేపటి తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్లండని నాన్నమ్మ చెప్పింది.. దురదృష్టవశాత్తూ అవే మాతో ఆమె చెప్పిన చివరి మాటలు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
నాన్నమ్మ తన వృద్ధాప్యం వల్ల ఇంటిలో ఉండిపోయారు. బుల్లెట్ల వడగళ్ల వాన తమను తాకింది. ఆలస్యం చేస్తే మేము కూడా ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని కన్నీంటిపర్యంతమయ్యాడు. జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన సుమారు రెండు నెలల తర్వాత ప్రేమ్‌కంఠ్ ఒకప్పుడు ఇల్లు అని పిలిచే నిర్మాణం ఉన్న ప్రదేశానికి వచ్చాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో స్వాతంత్ర సమరయోధుడైన తన భర్త దిగిన ఇబేటోంబికి ఎంతో ప్రియమైన ఫోటోను శిథిలాల నుంచి తీసుకున్నాడు.
ఘటన జరిగి రెండు నెలలవుతున్నా ఇప్పటికీ శిథిలాల్లో ఇబేటోంబి పుర్రే, కాలిన ఎముకలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గ్రామం నుంచి కొంచెం దూరంలో సెరో మార్కెట్‌లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇక్కడ వ్యాపారం చేసుకుని జీవించే వారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పారిపోయారు.
సాయుధ మూక దాడి చేసిన రోజును గుర్తుచేసుకుంటూ ఇబేటోంబి కోడలు.. తాము ఒక ఎమ్మెల్యే ఇంటిలో ఆశ్రయం పొందామని, తీవ్రమైన కాల్పుల మధ్య చాలా కష్టంతో అక్కడకు చేరుకున్నామని తెలిపారు. ‘తెల్లవారుజామున 2.00 గంటలకు మేము భయపడి పారిపోయాం.. మేము ముందు వెళ్లిపోయాం.. తర్వాత మా అత్తను తీసుకురావడానికి ఒకరిని పంపించాలని పట్టుబట్టాం.. కాల్పులు కొనసాగుతుండటంతో భయపడి మా స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో ఆశ్రయం పొందాం.. ఆపై మా పిల్లలు ఆమెను రక్షించడానికి ఉదయం 6 గంటల సమయంలో వెళ్లేటప్పటికి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది’ అని వాపోయింది.