మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆయన గన్‌మెన్లను తొలగించారు.. గత ఐదేళ్లుగా ఆయనకు సెక్యూరిటీగా ఉన్న గన్‌మెన్లు మూడురోజులుగా వారు విధులకు రావట్లేదు. వెంటనే మాజీ మంత్రి గన్‌మెన్‌లు ఎందుకు రావడంలేదని ఆరా తీయగా రాష్ట్ర ప్రభుత్వం గన్‌మెన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వారిని తొలగించడం ఏంటని కన్నా ప్రశ్నిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి.. కన్నాకు గన్‌మెన్లను లేకుండా చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో ఆయన బీజేపీలో చేరారు.. ఏపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే అధిష్టానం తీరు నచ్చకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తెలుగు దేశం ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవిని అప్పగించింది. అయితే కన్నా కొంతకాలంగా మంత్రి అంబటి రాంబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
లక్ష్మీనారాయణ ఇటీవల చేసిన విమర్శలకు మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌ను కన్నా దూషించడం సరికాదని.. పోలీసులు ఎవరి మీదా అన్యాయంగా కేసులు పెట్టడం లేదన్నారు. టీడీపీలోకి రావాలని కన్నా లక్ష్మీనారాయణ తన కార్యకర్తల వెంటపడుతున్నారని.. ఎవరి మీదా అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి. లక్ష్మీనారాయణ ఏమైనా పెద్ద పెద్ద వస్తాదా.. బిచ్చగాడు అంటూ తీవ్వస్థాయిలో ధ్వజమెత్తారు. తన మాట వినలేదని డీఎస్పీ, ఎస్పీపై కన్నా కన్నా విమర్శలు చేస్తున్నారని.. బూతులు తిట్టడంలో ఆయనది గిన్నిస్ బుక్ రికార్డ్ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో కన్నా చంద్రబాబును తిట్టిన విషయం మర్చిపోయారా అన్నారు.
సత్తెనపల్లిలో గంజాయి అమ్మకాలు లేవని.. సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ ఎంతో నిజాయితీ ఉన్న అధికారన్నారు. తన మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వ డబ్బుతో చంద్రబాబు ప్రధాని నరేద్ర మోదీని విమర్శించినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఏం చేశారని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నారని.. వాలంటీర్ వ్యవస్థపై బురదజల్లుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కలసి ప్రయాణం చేస్తున్నారని.. ప్రస్తుతం వాళ్లిద్దరూ కలిసే జీవిస్తున్నారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబు, పవన్‌లకు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు కూడా లేదన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ హైదరాబాద్ వెళ్లిపోతారని సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి రాంబాబు.